జూన్‌లో భారీగా పెరిగిన ద్రవ్యోల్భణం

  • గత కొన్నిరోజులుగా ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
  • మే నెలలో 4.31 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నాటికి 4.81 శాతానికి పెరుగుదల
  • మాంసం, చేపలు, పాలు, గుడ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ధరల్లో భారీ పెరుగుదల
భారత రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగింది. అంతకుముందు నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.49 శాతంగా నమోదైంది. తృణధాన్యాలు, మాంసం, చేపలు, గుడ్లు, పాలు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు, ఇంధనం ధరలు మే నెలతో పోలిస్తే జూన్‌లో బాగా పెరిగాయి.

మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతం కాగా, ఆహార ద్రవ్యోల్బణం 2.96 శాతంగా ఉంది. 2022 జూన్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 7.75 శాతంగా ఉంది. ఏడాది ప్రాతిపదికన మాత్రం తగ్గింది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్బీఐ టాలరెన్స్ స్థాయి కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా నాలుగో నెల. ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 2 శాతం నుండి 6 శాతం మధ్య ఉంది.


More Telugu News