ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లదు: ఐపీఎల్ చైర్మన్

  • టీమిండియా పాకిస్థాన్‌ వెళ్లనుందంటూ పాక్ మీడియాలో వార్తలు
  • అవన్నీ పుకార్లేనన్న ఐపీఎల్ చైర్మన్ ధుమాల్
  • ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని వెల్లడి
  • ఇండియా మ్యాచ్‌లు హైబ్రీడ్ మోడల్‌లో జరుగుతాయని వెల్లడి
ఆసియా కప్‌ నిర్వహణపై మొదటి నుంచి గందరగోళమే. ఈ సిరీ‌స్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు హైబ్రీడ్ మోడల్‌కు బీసీసీఐ ఒప్పుకోవడంతో టోర్నీపై స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ కోసం టీమిండియా పాకిస్థాన్‌ వెళ్లనుందంటూ వస్తున్న వార్తలపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. 

ఆసియా కప్‌లో భాగంగా మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లబోదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, హైబ్రీడ్ మోడల్‌లో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. 

సౌతాఫ్రికాలోని దర్బన్‌లో జరగనున్న ఐసీసీ ఛీప్ ఎగ్జిక్యూటివ్స్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషాతోపాటు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో భారత్ మ్యాచ్ జరిగే అవకాశాన్ని తోసిపుచ్చారు. 

‘‘ఇండియా, పాక్ మ్యాచ్‌ శ్రీలంకలో జరుగుతుంది. ఆసియా కప్ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు పీసీబీ ప్రతినిధి హెడ్ జకా అష్రాఫ్‌ను జైషా కలిశారు” అని వెల్లడించారు. టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటిస్తుందటూ పాక్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఆసియా కప్ కొనసాగనుంది.


More Telugu News