పవన్ కల్యాణ్‌కు అనిల్ కుమార్ యాదవ్ సూటి ప్రశ్న
- వాలంటీర్ల వ్యవస్థలో ఒకటీ అరా పొరపాట్లు జరగకుండా ఉండవన్న అనిల్
- ఎక్కడైనా జనసైనికులు తప్పు చేస్తే పవన్ కల్యాణ్ చేసినట్లేనా? అని ప్రశ్న
- జనసైనికులు గంజాయి తాగుతూ దొరకలేదా? అని నిలదీత
- వాలంటీర్ల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారని హెచ్చరిక
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఎక్కడో ఒకటీ అరా జరిగితే మొత్తం ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. మరి ఎక్కడైనా జనసైనికులు తప్పు చేస్తే పవన్ కల్యాణ్ చేసినట్లేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఏం మాట్లాడతారో తెలియదని, రంకెలేసి వెళ్తారని ఎద్దేవా చేశారు.
‘‘రాష్ట్రంలో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో 1.30 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థలో ఒకటీ అరా పొరపాట్లు జరగకుండా ఉండవు. ఒక సంఘటన జరిగితే.. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.
‘‘నా జనసైనికులు, నా వీర మహిళలు అని పవన్ కల్యాణ్ అంటున్నారు. నీ జనసైనికులు ఎక్కడా పొరపాట్లు చేయలేదా? గంజాయి తాగుతూ దొరకలేదా? పాడు పని చేస్తూ దొరకలేదా? తాగేసి గొడవలు చేయడం ఎక్కడా జరగలేదా?” అని అనిల్ కుమార్ ప్రశ్నించారు.
‘‘జన సైనికులు ఏం చేసినా నువ్వు చేసినట్టేనా? గంజాయి అమ్ముతూ జనసైనికుడు దొరికితే.. తాగి గొడవ చేస్తే.. ఎవడైనా మహిళల్ని హింసిస్తే.. నువ్వు చేసినట్టేనని ఒప్పుకుంటావా?” అని నిలదీశారు. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు. వాలంటీర్ల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారని అన్నారు.