విద్యుత్ వివాదం.. బీఆర్ఎస్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్

  • వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపించాలన్న వెంకట్‌రెడ్డి
  • సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని సవాల్
  • ‘3 గంటలు కావాలా.. 3 పంటలు కావాలా’ అన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలని ఫైర్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు 
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్‌కి సేవ చేస్తానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. ‘మూడు గంటలు కావాలా.. మూడు పంటలు కావాలా’ అన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలంటూ కేటీఆర్‌‌పై మండిపడ్డారు.

‘‘రైతులకు పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తా. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం. అక్కడి బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్‌కి సేవ చేస్తా. 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేస్తా” అని చాలెంజ్ చేశారు.

ఒక్కో ఎమ్మెల్యే రూ.వెయ్యి కోట్లు తిన్నారని, తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని వెంకట్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నా సవాలుకు ఎవరొస్తారో రండి.. కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంటయినా ఇస్తున్నారో చూపించండి” అని అన్నారు. తాము తలపెట్టిన సత్యా
గ్రహ దీక్షని భగ్నం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న కుట్ర ఇదంతా అని ఆరోపించారు. 

‘‘కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తోంది. మా పీసీసీ చీఫ్ ఏదో మాట అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు
” అని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి హైదరాబాద్ వస్తారని, రేపు పీసీసీతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

తెలంగాణలో పది గంటలకు మించి కరెంటు రావడం లేదని, దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలని వెంకట్ రెడ్డి సవాల్ చేశారు. 
కల్వకుంట్ల కుటుంబం నీరవ్‌ మోదీలా దుబాయ్‌కి పారిపోతుందని అన్నారు. ఆ నలుగురితోపాటు మొత్తం కుటుంబ సభ్యులందరూ పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.


More Telugu News