వరదలకు వందమందికిపైగా బలి.. హిమాచల్‌ప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు

  • దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 80 మంది మృత్యువాత
  • విరిగిపడుతున్న కొండచరియలు
  • ఉత్తరాఖండ్‌లో 9 మంది యాత్రికుల మృతి
  • హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 1,050 కోట్ల నష్టం
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు ముంచుకొస్తుండగా, మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 300 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. పంజాబ్, హర్యానాలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఉత్తరాఖండ్‌లో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా కొండచరియలు విరిగిపడి మరో 13 మంది గాయపడ్డారు. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తోంది. యమునా సాగర్‌లోని హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి యమునా నదిలోకి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుండడంతో పాత యమునా బ్రిడ్జిని మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1,050 కోట్ల నష్టం సంభవించింది. 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 41 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.


More Telugu News