తమిళనాడులో ఫ్యామిలీ ట్రిప్... వివరాలు పంచుకున్న రాజమౌళి

  • చాలాకాలంగా తమిళనాడులో పర్యటించాలనుకుంటున్నట్టు రాజమౌళి వెల్లడి
  • కుమార్తె ద్వారా తన కోరిక నెరవేరిందని వివరణ
  • తన కుమార్తె తమిళనాడు దేవాలయాలు చూడాలని కోరిందన్న రాజమౌళి
  • దాంతో అందరం కలిసి బయల్దేరామని ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక, విహార యాత్రకు వెళ్లారు. ఈ వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"తమిళనాడులో రోడ్ ట్రిప్ వేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. అది మా అమ్మాయి వల్ల నెరవేరింది. అందుకు మా అమ్మాయికి థాంక్స్ చెప్పాలి. తమిళనాడులోని దేవాలయాలు తిరిగొద్దామని తను అనడంతో సరే అని అందరం బయల్దేరాం.

జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, తూత్తుకుడి, మధురై మొదలైన పుణ్యక్షేత్రాలను సందర్శించాం. ఆ కొన్ని రోజుల్లో తమిళనాడులోని ఆధ్యాత్మిక సంపదలో మేం చూసింది చాలా తక్కువే అనుకుంటున్నాను. 

పాండ్య రాజులు, చోళులు, నాయకర్లు, ఇతర రాజుల అద్వితీయమైన వాస్తు శిల్ప రీతులు, వారి ఇంజినీరింగ్ నైపుణ్యం, నిశితమైన ఆధ్యాత్మిక ఆలోచనలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. 

ఇక భోజనం విషయానికొస్తే మంత్రకూడం, కుంభకోణంలో మేం తిన్న భోజనం అమోఘం. కాకా హోటల్ కానివ్వండి, మురుగన్ మెస్ కానివ్వండి తమిళనాడులో ఎక్కడ చూసినా అద్భుతమైన భోజనం. నేను ఒక్క వారంలోనే 2-3 కిలోలు బరువు పెరిగానంటే ఎలా తిన్నానో చూస్కోండి. 

దాదాపు 3 నెలలు విదేశాల్లో పర్యటించిన తర్వాత సొంతగడ్డపై ఈ యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది, ఉత్సాహం రెట్టింపైనట్టు అనిపించింది" అంటూ రాజమౌళి తన పోస్టులో వివరించారు.


More Telugu News