సోనీ లివ్ లో 'ఫర్హానా' .. ఇంట్రెస్టింగ్ గా సాగే థ్రిల్లర్ డ్రామా!

  • ఐశ్వర్య రాజేశ్ నుంచి 'ఫర్హానా'
  • ఆసక్తిని రేకెత్తించే కథ .. కథనం 
  • ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
  • ఐశ్వర్య రాజేశ్ నటన హైలైట్ 
కోలీవుడ్ లో నాయిక ప్రధానమైన పాత్రలను పోషించాలంటే ముందుగా మేకర్స్ కి గుర్తొచ్చేది నయనతార .. ఆ తరువాత త్రిష. ఈ ఇద్దరికీ ఉన్న స్టార్ డమ్ వేరు. అందువలన ఆ తరువాత వరుసలో ఈ తరహా కథలు చర్చకు రాగానే అందరూ చెప్పే మాట ఐశ్వర్య రాజేశ్. ఆమె హైట్  .. ఆమె కళ్లు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. సహజమైన ఆమె అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. 

అలాంటి ఆమె నుంచి మే 12న వచ్చిన 'ఫర్హానా' థియేటర్స్ నుంచి పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఐశ్వర్య రాజేశ్ కి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది .. ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఆ స్థాయి ఇమేజ్ ను ఆమె ఇంకా అందుకోలేదు. అలాంటి ఆమె చేసిన 'ఫర్హానా' ప్రస్తుతం 'సోనీలివ్' లో అందుబాటులో ఉంది. ఓటీటీలో ఈ సినిమాకి ఇప్పుడు ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఈ సినిమాలో దర్శకుడు కాల్ సెంటర్స్ వైపు నుంచి కొత్త పాయింటును టచ్ చేశాడు.

ఒక ముస్లిమ్ ఫ్యామిలీలో 'ఫర్హానా' చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలాంటి ఆమె ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా ఒక కాల్ సెంటర్ లో జాయిన్ అవుతుంది. తరచూ కాల్ చేసే ఒక వ్యక్తి వాయిస్ .. అతని మాటతీరు నచ్చడంతో, అతని గురించి ఆలోచన చేయడం మొదలుపెడుతుంది. ఆమెలో వచ్చిన మార్పును భర్త .. మామ ఇద్దరూ గమనిస్తారు. తన ఆలోచనలు తప్పుదోవలో వెళుతున్నాయని భావించి సరిచేసుకోవాలనుకునేలోగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఫర్హానా కథకి ముగింపు ఏమిటి? అనేది కథ.

అక్కడక్కడా కాస్త సాగతీసినట్టుగా అనిపించే సన్నివేశాల విషయంలో కొంచెం ఓపిక పడితే, కంటెంట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కూడా విలన్ ఎవరనేది చూపించకుండా కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య రాజేశ్ నటన కంటెంట్ ముందు అలా కూర్చోబెట్టేస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. నెల్సన్ వెంకటేశన్ అల్లుకున్న కథ .. ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. సోనీ లివ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను, ఐశ్వర్య రాజేశ్ నటన కోసం చూడొచ్చు.



More Telugu News