పవన్ కల్యాణ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మల్లాది విష్ణు

  • పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న ఎమ్మెల్యే
  • వాలంటీర్లపై వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ మండిపడ్డ విష్ణు
  • పవన్ తన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. తాజాగా మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. పవన్ చేస్తున్న వారాహి యాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ తరఫున చేపట్టిన యాత్రలో పార్టీ విధివిధానాలను చెప్పుకోవాలి కానీ ఇతరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో వాలంటీర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుర్తుచేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్ కు లేదని, ఏ ఆధారాలతో వాలంటీర్లపై ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యే హెచ్చరించారు.


More Telugu News