రూ.కోటి ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలను రీడెవలప్ చేసిన కేసీఆర్ మనవడు

  • తన స్కూల్ లో నిధులు సేకరించి ఖర్చుపెట్టినట్లు వెల్లడి
  • రేపు విద్యాశాఖ మంత్రి ప్రారంభిస్తారంటూ హిమాన్షు ట్వీట్
  • తాతకు తగ్గ మనవడంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు. సుమారు రూ.కోటి ఖర్చు చేసి రీడెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్ లా మారిపోయింది. హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (జులై 12) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ స్కూలును ప్రారంభిస్తారు.

ఈ విషయాన్ని హిమాన్షు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. స్కూలు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయిందనేది వివరిస్తూ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తాతకు తగ్గ మనవడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఖాజాగూడలోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న హిమాన్షు.. క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సీఏఎస్ తరఫున తమ స్కూలుకు దగ్గర్లో ఉన్న కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన స్కూల్ లో నిధులు సేకరించి ఈ పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెట్టారు. విద్యార్థులకు బెంచీలు, టాయిలెట్ల నిర్మాణం, భోజనం గది, ఆట స్థలం తదితర సౌకర్యాలను సీఏఎస్ నిధులతో సమకూర్చాడు. స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.


More Telugu News