2075 కల్లా అమెరికాను అధిగమించనున్న భారత్!

  • రాబోయే 50 ఏళ్లలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
  • యువత, కార్మికుల ఉత్పాదకత, పెట్టుబడుల్లో పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం
  • గోల్డ్‌మన్ శాక్స్ నివేదికలో వెల్లడి
భారత దేశం 2075 కల్లా అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన తాజాగా నివేదికలో వెల్లడించింది. అమెరికాతో పాటూ జపాన్, జర్మనీని కూడా భారత్ వెనక్కు నెడుతుందని పేర్కొంది. దేశజనాభాలో అధికంగా ఉన్న యువత, సృజనాత్మకత, సాంకేతికత, పెట్టుబడులు, కార్మికుల సగటు ఉత్పాదకతలో వృద్ధి వెరసి భారత్‌ను ముందంజలో నిలుపుతాయని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా భారత్‌లోనే యువత శాతం పెరిగి వృద్ధులు, చిన్నారుల శాతం తగ్గుతుంది’’ అని నివేదికలో వెల్లడించింది. 

పెట్టుబడుల్లో పెరుగుదల, సృజనాత్మకత, కార్మికుల ఉత్పాదకతలో పెరుగుదల వంటికి భారత్ ఆర్థికరంగానికి చోదకాలుగా నిలుస్తాయని గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన భారత సంతతి ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా వెల్లడించారు. ఆర్థికకార్యకలాపాల్లో వృద్ధి కారణంగా ప్రజలు పొదుపు చేసుకున్న మొత్తాలు పెట్టుబడులుగా మారి ఆర్థికరంగం దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు. అయితే, భారత్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఆశించిన స్థాయిలో పెరగకపోతే ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందని నివేదిక వెల్లడించింది. దేశజనాభాలో ప్రస్తుతం ఏదో ఒక ఉపాధి పొందుతున్న వారు, ఉపాధి కోసం వెతుకుతున్న వారి సంఖ్యను లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుగా పిలుస్తారు.


More Telugu News