​​జగన్ ఐపీఎల్ అనగానే సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు: నారా లోకేశ్​

  • కావలి పట్టణంలో నారా లోకేశ్ యువగళం
  • బహిరంగ సభకు పోటెత్తిన ప్రజానీకం
  • జగన్ ఈ మధ్య భయంభయంగా మాట్లాడుతున్నాడన్న లోకేశ్
  • తల్లీ చెల్లిని చూసి వణికిపోతున్నాడని ఎద్దేవా
  • కావలి ఎమ్మెల్యేకి అనకొండ అంటూ నామకరణం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో ప్రవేశించింది. 153వ రోజు కావలి పట్టణంలో యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి. 

కావలి బీపీఎస్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో లోకేశ్ వాడీవేడిగా, తనదైన శైలిలో ఛలోక్తులు, చమత్కారాలతో ప్రసంగించారు.

నెల్లూరు జిల్లాలో యువగళం ప్రభంజనం

నెల్లూరు జిల్లాలో యువగళం ఒక ప్రభంజనం. జగన్ జెండా పీకేయడం ఖాయం. కావలిలో మాస్ జాతర అదిరిపోయింది. పోరాటాల గడ్డ కావలి. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నివసించిన నేల కావలి. బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కావలి. ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
జగన్ పనై పోయింది... ఎవర్ని చూసినా భయపడుతున్నాడు!

ఈ మధ్య జగన్ మాటలు విన్నారా? భయంతో మాట్లాడుతున్నాడు, జగన్ పనైపోయింది . యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది. ఆఖరికి అమ్మని చూసినా, చెల్లిని చూసినా జగన్ కి భయంతో వణికిపోతున్నాడు. జగన్ ఈ మధ్య పదే పదే నేను మీ బిడ్డని అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం లాగేసి కన్న తల్లిని, చెల్లిని గెంటేశాడు. అయినా ఆస్తి మీద ఆశ చావలేదు. ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మీ బిడ్డనే కదా అని మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు రాసివ్వండి అని లాక్కుంటాడు. 

ఐపీఎల్ టీమ్ పెడితే ఏం పేరు పెడతారు?

జగన్ ఒక జబర్దస్త్ కమెడియన్. ఈ మధ్యే ఏపీకి కూడా ఐపీఎల్ క్రికెట్ టీం ఉండాలి అన్నాడు. నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కి ఆర్థిక సాయం చెయ్యని వాడు ఐపీఎల్ క్రికెట్ టీం గురించి మాట్లాడుతున్నాడు. స్టేడియంలో ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లే ప్లేయర్స్ కి ఎంట్రీ ఫీజు పెట్టి దోచుకుంటున్న జగన్ ఐపీఎల్ టీం పెడతాడా?

జగన్ ఐపీఎల్ అనగానే సోషల్ మీడియాలో జనాలు ఒక ఆట ఆడుకున్నారు. ఈ మధ్యే ఒక పోస్ట్ చూశాను... సైకో జగన్ ఏపీకి ఐపీఎల్ టీం ఉంటే ఏమి పేరు పెడతాడు అని? ఆప్షన్స్ చూసి నాకు నవ్వు ఆగలేదు, ఆప్షన్స్ ఏంటో తెలుసా? 1) త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జేసీబీ నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ ఛాలెంజర్స్.

కావలిని అరాచకాలకు అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే

కావలి కనకపట్నంగా మారుతుందని బ్రహ్మం గారు చెప్పారు. కావలిని కనకపట్నంగా మార్చేస్తారని మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని రెండుసార్లు గెలిపించారు. కానీ, ఆయన కావలిని కష్టాలపట్నంగా మార్చేశాడు. ఆయనకి పేరులో మాత్రమే ప్రతాపం ఉంది మనిషిలో ప్రతాపం లేదు. 

ఆయన చేసిన అవినీతి గురించి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి ముద్దుగా అనకొండ అని పేరు పెట్టాను. దోచుకోవడం, దాచుకోవడం కావలి అనకొండ స్పెషాలిటీ. ఆఖరికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా వదలడం లేదు ఈ అనకొండ.

టీడీపీ హయాంలోనే కావలి అభివృద్ధి!

టీడీపీ హయాంలో కావలి అభివృద్ధి లో నెంబర్ వన్. రోడ్లు, సీసీ రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టీడీపీ. ఆక్వా ఎగుమతుల్లో కావలిని నెంబర్ వన్ చేశాం. నీరు చెట్టు పథకకం కింద చెరువులను అభివృద్ధి చేసాం. మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, మోటారు బోట్లు, ఆటోలు, ట్రక్కులు, ఐస్ బాక్స్‌లు ఇచ్చాం. ఫిషింగ్ హార్బర్ తెచ్చింది టీడీపీ. 

కానీ మీరు ఏం చేశారు... పాలిచ్చే ఆవుని వద్దనుకోని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనకొండ ఎంత చేతగాని వాడో నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలే ఒక పాంప్లెట్ వేసి పంచుతున్నారు. ఇదిగో నాకు కూడా ఇచ్చారు.

శిలాఫలకాలు ఏమయ్యాయి?

అనకొండ వేసిన శిలాఫలకాల లిస్ట్ చదువుతాను అవన్నీ అయ్యాయో లేదో మీరే చెప్పాలి. పార్కులు, రోడ్లు, బ్రిడ్జ్ లు, శ్మశానాలు, ఇండోర్ స్టేడియం, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్, ఇందిరమ్మ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్... వీటిలో ఒక్క పని అయినా పూర్తి అయ్యిందా? ఎలాగో అనకొండ ఇంటికి పోయే టైం దగ్గర పడింది. ఆయన వేసిన శిలాఫలకాలు అన్ని ఆయన ఇంటికే పంపుదాం. అతని చేతగానితనానికి గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాడు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

మేం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా సాగు నీరు అందిస్తాం. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం. మత్స్యకారులు జగన్ పాలనలో పడుతున్న బాధలు నాకు తెలుసు. గతంలో ఎలా అయితే వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు ఇచ్చామో, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మీకు అందజేస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1999.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 16.0 కి.మీ.*

*153వ రోజు పాదయాత్ర వివరాలు (11-7-2023):*

*కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

ఉదయం

8.00 – శ్రీపురం క్రాస్ వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.45 – కొత్తపల్లి ఎస్సీ కాలనీలో స్థానికులతో సమావేశం.

10.00 – కొత్తపల్లిలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం

*11.30 – పాదయాత్ర 2000 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ*

11.45 – కొత్తపల్లిలో దివ్యాంగులతో సమావేశం.

మధ్యాహ్నం

1.55 – ఆర్ సిపాలెంలో భోజన విరామం.

సాయంత్రం

3.00 – ఆర్ సి పాలెం నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.45 – రాజువారిచింతలపాలెంలో స్థానికులతో సమావేశం.

4.15 – ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.45 – రామవరప్పాడులో స్థానికులతో సమావేశం.

6.45 – చోడవరంలో స్థానికులతో సమావేశం.

7.45 – చోడవరం శివారు విడిది కేంద్రంలో బస.

*******


More Telugu News