పవన్ కల్యాణ్ ఎప్పటికీ నటుడే.. రాజకీయ నాయకుడు కాలేడు: అడపా శేషు

  • బాబును సీఎం చేయాలనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోందన్న శేషు 
  • ఏపీ ప్రజలు తనను నమ్మరని ఏలూరు సభలో తెలిసొచ్చిందని ఎద్దేవా
  • పవన్ క్షమాపణ చెప్పకుంటే తిరగనివ్వమని హెచ్చరిక
  • జగన్ ఫోటో చూస్తేనే పవన్ భయపడిపోతున్నారని వ్యాఖ్య
  • జనసైనికుల పరిస్థితి ఏమిటని పవన్ కు ప్రశ్న
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పవన్ కు ఘోరమైన అభిప్రాయం ఉందని, ఇందుకు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఏపీ ప్రజలు తనను ఇక నమ్మరని ఏలూరు సభలో పవన్ ఓ అభిప్రాయానికి వచ్చారన్నారు.

మహిళల పట్ల, వాలంటీర్ల పట్ల అనుచితంగా మాట్లాడారన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వైపు చూస్తుంటే, పవన్ విమర్శలు చేస్తున్నారన్నారు. తన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని లేదంటే తిరగనివ్వమని హెచ్చరించారు. 30వేల మంది మహిళలు కనిపించకుండా పోయారన్న పవన్ కు కళ్లు పోయాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో మహిళలపై జరిగిన అకృత్యాలు పవన్ కు కనిపించలేదా? అని నిలదీశారు. పవన్, చంద్రబాబు, లోకేశ్ లకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.

జగన్ ఫోటో చూస్తేనే పవన్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఏకవచనంతో పిలుస్తారా? పవన్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పవన్ ఎప్పటికీ నటుడేనని.. రాజకీయ నాయకుడు కాలేడన్నారు. ఆయన కేవలం ఈ రాష్ట్రానికి వచ్చి నటించి పోయేవాడు మాత్రమే అన్నారు. పవన్.. నువ్వొక్కడివి కమ్మగా ఉంటే సరిపోయిందా? నిన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. జనసైనికులంతా జాగ్రత్తగా ఉండాలని, పవన్ ను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.


More Telugu News