కర్ణాటక అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ!

  • స్కానింగ్‌ చేసిన సమయంలో గుర్తించిన భద్రతా సిబ్బంది
  • మహిళను అదుపులోకి తీసుకుని విచారణ
  • గత వారం అసెంబ్లీలోకి చొరబడిన ఓ వృద్ధుడు
కర్ణాటక అసెంబ్లీలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల ఓ సామాన్య వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి, ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే.. తాజాగా ఇంకో భయానక ఘటన జరిగింది. విధాన సౌధలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

విధాన సౌధలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ మహిళను తనిఖీ చేయగా.. ఆమె వద్ద కత్తి దొరకడం కలకలం రేపింది. తూర్పు గేటు నుంచి ఆ మహిళ లోపలికి వస్తుండగా.. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్‌ మెషిన్‌లోకి పంపారు. అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగ్నల్‌ వచ్చింది. 

దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది. పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

గతవారం బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఓ వ్యక్తి సభలో ప్రవేశించి జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్‌ అడ్డుచెప్పకపోవడంతో సభలోకి సులువుగా ప్రవేశించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మార్షల్స్‌ అతడిని బయటకు తీసుకెళ్లారు. అతడిని 70 ఏళ్ల రుద్రప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


More Telugu News