టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు కథనం.. నిజనిర్ధారణలో ఫెయిల్ అయ్యామన్న పీటీఐ!

  • దేశంలో భారీగా పెరిగిన టమాటా ధరలు 
  • టమాటా వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నాడంటూ వార్త వైరల్
  • ఈ కథనం పూర్వాపరాలను ధ్రువీకరించడంలో తప్పు చేశామన్న పీటీఐ
  • తాము ఆ ట్వీట్‌ను తొలగించామని వెల్లడి
ఎన్నడూ లేనంత స్థాయిలో టమాటా ధరలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాట దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని వారణాసిలో తన షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్తను పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) కూడా రాసుకొచ్చింది. 

అయితే అందులో నిజం లేదని పీటీఐ తాజాగా చెప్పుకొచ్చింది. నిజనిర్ధారణ చేయడంలో తాము ఫెయిల్ అయ్యామని ట్వీట్ చేసింది. ‘‘వారణాసిలోని ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించాం. మాకు సమాచారం ఇవ్వడంలో అతడి ఉద్దేశం సందేహాస్పదంగా ఉంది. దీంతో మేము ఆ ట్వీట్‌ను తొలగించాం” అని వివరించింది.

‘‘ఈ కథనం పూర్వాపరాలను ధ్రువీకరించడంలో మేము తప్పు చేశాం. మేం నిర్దేశించుకున్న ఉన్నత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాం. కచ్చితమైన, నిష్పాక్షికమైన వార్తలను అందించడానికి పీటీఐ కట్టుబడి ఉందని మా పాఠకులకు హామీ ఇస్తున్నాం” అని  చెప్పుకొచ్చింది.

యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు చెప్పింది. ధ్రువీకరించుకోకుండా ప్రసారం చేసినందుకు తాజాగా పీటీఐ క్షమాపణలు చెప్పింది.


More Telugu News