ఈ ఏడాది కేసీఆర్ కోసం అమ్మవారికి మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి

  • నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు
  • కుటుంబ సభ్యులతో కలిసి బోనమెత్తిన మంత్రి మల్లారెడ్డి
  • దేశవ్యాప్తంగా కేసీఆర్ విజయవంతం కావాలని కోరుకున్నట్టు వెల్లడి
  • తన కోరిక తప్పక నెరవేరుతుందని ధీమా
హైదరాబాద్ నగరంలో బోనాల కోలాహలం నెలకొంది. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనవాయతీ ప్రకారం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారికి బోనం తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నానని, ఇప్పటివరకు తాను అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీరాయని వెల్లడించారు. ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని, ఆ కోరిక కూడా తీరుతుందని నమ్ముతున్నానని తెలిపారు. 

అంతేకాదు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తాను ఏం కోరుకున్నదీ మల్లారెడ్డి వెల్లడించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయని, అది నెరవేరాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయవంతం అవ్వాల్సిన అవసరం ఉందని, తాను అమ్మవారిని కోరుకుంది ఇదేనని స్పష్టం చేశారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్, బీజేపీ పరిపాలనలు చూశామని, కానీ బీఆర్ఎస్ తరహా అభివృద్ధిని దేశంలో మరెవ్వరూ చేయలేకపోయారని మల్లారెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News