బీటెక్ అర్హతతో మెట్రోలో ఉద్యోగాలు

  • నెలకు రూ.2 లక్షలకు పైగా జీతం
  • నోటిఫికేషన్ జారీ చేసిన చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్
  • పలు విభాగాలలో 17 పోస్టుల భర్తీకి ప్రకటన
బీటెక్ సహా టెక్నికల్ డిగ్రీ పట్టా పొందిన నిరుద్యోగులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు విభాగాలలో ఖాళీగా ఉన్న 17 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు పెద్ద మొత్తంలో జీతం చెల్లించనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్‌ మేనేజర్‌ (జీఎం), జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (జేజీఎం), మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, రోలింగ్‌ స్టాక్‌, పవర్‌ సిస్టమ్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని వివరించింది.

దరఖాస్తు చేసే పోస్టు ఆధారంగా అభ్యర్థులకు కావాల్సిన అర్హతలను చెన్నై మెట్రో రైల్ వెల్లడించింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ సీఏ/ ఎంబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అదేవిధంగా కనీసం 2 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల వరకు అనుభవం ఉండాలని పేర్కొంది. అభ్యర్థుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని వెల్లడించింది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.2.3 లక్షల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో 04-08-2023 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


More Telugu News