బరువైన విమానం.. టేకాఫ్ కష్టమంటూ 19 మంది ప్రయాణికులను దించేసిన పైలట్!

  • స్పెయిన్ నుండి బ్రిటన్ వెళ్లాల్సిన విమానంలో ఘటన
  • ప్రతికూల వాతావరణంలో బరువైన విమానం నుండి ప్రయాణికుల దించివేత
  • రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఈజీజెట్

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. బరువైన విమానం టేకాఫ్ కు కష్టంగా మారడంతో ఆ విమానం నుండి 19 మంది ప్రయాణికులను దింపివేసిన సంఘటన స్పెయిన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన షెడ్యూల్ దాటిపోయింది. విమానం టేకాఫ్ కోసం పైలట్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులను దింపేశారు. స్పెయిన్‌లోని లాంట్రోజ్ విమానాశ్రయంలో ఈ విచిత్ర అనుభవం ఎదురైంది.

బ్రిటన్ కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ స్పెయిన్ నుండి బ్రిటన్ కు వెళ్లాల్సి ఉంది. జులై 5, బుధవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ కావాలి. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆలస్యమైంది. రన్ వే పొడవు కూడా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో బరువైన ఈ విమానం టేకాఫ్ కష్టమని పైలట్ చెప్పాడు. కొందరు ప్రయాణికులు దిగిపోతే టేకాఫ్ సాధ్యమవుతుందని చెప్పాడు.

ఇరవై మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే విమానం టేకాఫ్ అవుతుందని, అలా దిగిన వారు తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించారు. అంతేకాదు విమానం దిగిన వారికి 500 పౌండ్ల పారితోషికం ఇస్తామన్నారు. ఆఫర్ ఇచ్చినా ఎవరూ దిగడానికి ముందుకు రాలేదు. చివరకు సిబ్బంది నచ్చజెప్పి 19 మంది ప్రయాణికులను విమానం నుండి కిందకు దింపి, ఆ తర్వాత విమానంలో పంపించారు. వారు దిగిన తర్వాత రెండు గంటల ఆలస్యంగా రాత్రి 11.24 గంటలకు టేకాఫ్ అయింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ప్రయాణికులు దిగాలని పైలట్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది.

'భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. ప్రస్తుతం గాలి బాగా వీస్తున్న పరిస్థితుల్లో ఈ విమానాన్ని టేకాఫ్ చేయలేని పరిస్థితి. భారీ విమానం కారణంగా కాస్త బరువు తగ్గించవలసి ఉంది' అని పైలట్ ప్రయాణికులతో చెప్పాడు. అయితే తాను ఈ రాత్రికే ఇంటికి వెళ్లాలని ఓ ప్రయాణికుడు పేర్కొనగా, మిగతావారు కూడా మేమూ ఇప్పుడే వెళతామని చెప్పినట్లుగా వీడియోలో ఉంది. కానీ ఆ తర్వాత 19 మంది ప్రయాణికులను ఒప్పించి, వారిని దించిన తర్వాత టేకాఫ్ అయింది.


More Telugu News