పెద్దారెడ్డికి సవాల్ విసిరిన జేసీ ప్రభాకర్ రెడ్డి గృహనిర్బంధం
- ఎమ్మెల్యే పెద్దారెడ్డి చీనీ తోటకు వెళ్తానని ప్రకటించిన జేసీ
- అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల మోహరింపు
- జేసీని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. ఉద్రిక్త వాతావరణం
సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తోటకు వెళ్తానని జేసీ ప్రకటించడంతో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జేసీ ఇంటి చుట్టూ మోహరించారు. దీంతో ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ.13.89 లక్షల పంట నష్టం పరిహారం అందిందని జేసీ ఆరోపణలు చేశారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వెళ్తానని ప్రకటించారు. పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని, దమ్ముంటే ఆపాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీని గృహ నిర్బంధం చేశారు.