భారత్‌ తో టెస్టుకు బాహుబలి క్రికెటర్‌‌ ను రంగంలోకి దించిన విండీస్

  • ఈ నెల 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు
  • తొలి టెస్టుకు 13 మంది క్రికెటర్లతో జట్టు ఎంపిక
  • టెస్టు జట్టులోకి స్పిన్నర్ రఖీమ్ కార్న్‌ వాల్‌ రీఎంట్రీ
భారత్‌ తో ఈ నెల 12 నుంచి జరిగే టెస్టు సిరీస్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. కేవలం తొలి టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టును ఎంపిక చేసినట్టు తెలిపింది. క్రెయిగ్ బ్రాత్ వైట్ ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. భారీకాయుడు, బాహుబలి క్రికెటర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న రఖీమ్ కార్న్‌వాల్‌ ను తిరిగి టెస్టు జట్టులోకి తీసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్ 'ఎ'తో జరిగిన సిరీస్‌లో వెస్టిండీస్ ఎ తరపున మంచి ప్రదర్శన ఆధారంగా ఎడమచేతి వాటం బ్యాటర్ కిర్క్ మెకెంజీని జట్టులోకి పిలిచారు. బ్యాటర్ అలిక్ అథానాజ్ కూడా తొలిసారి టెస్ట్ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.  

ఆఫ్ స్పిన్నర్ రఖీమ్ కార్న్‌వాల్‌ను తిరిగి టీమ్ లోకి రావడం ఆశ్చర్యకర నిర్ణయం. అతను చివరగా  2021 నవంబర్‌‌ లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రధాన స్పిన్నర్ గుడాకేష్ మోతీ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండటంతో అతనికి అవకాశం లభించింది. మొదటి టెస్టు డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో ఈనెల 12న ప్రారంభమవుతుంది. రెండో టెస్టు 20 నుంచి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతుంది.  

 వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, టాగ్ నరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డిసిల్వా, షనన్ గాబ్రియెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకెంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్
రిజర్వ్‌ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.


More Telugu News