పంచాయతీ ఎన్నికలకు ముందు.. నలుగురు తృణమూల్ కార్యకర్తల హత్య

  • పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ రాష్ట్రంలో హింస
  • ఇప్పటి వరకు 15 మంది బలి
  • ఈ ఉదయం ప్రారంభమైన పోలింగ్
  • 73,887 స్థానాలకు 2.06 లక్షల మంది పోటీ
పంచాయతీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌లో మరోమారు హింస చెలరేగింది. నలుగురు టీఎంసీ కార్యకర్తలు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం 7 గంటలకు పటిష్ఠ భద్రత మధ్య ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 5.67 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ముర్షీదాబాద్ జిల్లాలోని కపాస్‌డంగ ప్రాంతంలో చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ మృతి చెందగా, అదే జిల్లాలోని రేజినగర్‌లో జరిగిన నాటుబాంబు పేలుడులో మరో కార్యకర్త మృతి చెందాడు. జిల్లాలోని ఖర్‌గ్రామ్‌లో ఓ టీఎంసీ కార్యకర్తను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. అలాగే, ఈస్ట్ మిడ్నాపూర్‌లోని సోనాచురా గ్రామ్ పంచాయతీకి చెందిన తృణమూల్ బూత్ ప్రెసిడెంట్ దేవ్‌కుమార్‌పై బీజేపీ కార్యకర్త సుబల్ మన్నా, ఆయన స్నేహితులు దాడిచేశారు.

జల్పాయిగురిలోనూ టీఎంసీ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారు. ఈ హింసాకాండపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడింది. మరోవైపు, కూచ్‌బెహర్‌లో టీఎంసీ బూత్ కమిటీ చైర్మన్ గనేశ్ సర్కార్‌ను రాంపూర్‌లో పొడిచి చంపారు. మరో ఘటనలో దుండగుల కాల్పుల్లో సీపీఎం కార్యకర్త హఫీజుర్ రహ్మాన్‌ గాయపడ్డారు. నదియా జిల్లాలో జరిగిన హింసలో మరికొందరు టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారు.  

పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2.06 లక్షల మంది 73,887 సీట్లకు పోటీపడుతున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News