మా రసాయనిక ఆయుధాలన్నీ ధ్వంసం చేశాం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన

  • రసాయనిక ఆయుధాలను వదుల్చుకోవడం తమకెంతో గర్వకారణమని అధ్యక్షుడి ప్రకటన
  • తాజా చర్యతో కెమికల్ వెపన్స్ లేని ప్రపంచం దిశగా మరో అడుగు వేశామని వ్యాఖ్య
  • బ్లూ గ్రాస్ ఆర్మీ ఆయుధగారంలోని చిట్టచివరి ఆయుధం తొలగింపుతో మహాక్రతువు పూర్తి
తమ దేశంలో దశాబ్దాలుగా పోగుబడ్డ రసాయనిక ఆయుధాలన్నిటినీ ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. మూడు దశాబ్దాల నాటి రసాయనిక ఆయుధాల ఒడంబడికకు కట్టుబడి వీటిని ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఇది తమకు చాలా గర్వకారణమని, రసాయనిక ఆయుధాలు లేని ప్రపంచం దిశగా ఓ అడుగు వేశామని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో బ్లూ గ్రాస్ ఆర్మీ డిపాట్‌లో నిల్వ ఉంచిన రసాయనిక ఆయుధాలను అధికారులు ఇటీవలే పూర్తిగా ధ్వంసం చేశారు. నాలుగేళ్ల పాటు శ్రమించి మొత్తం 500 టన్నుల ఆయుధాలను తొలగించారు. వీటిల్లో మస్టర్డ్ గ్యాస్, వీఎక్స్, సారీన్ నెర్వ్ రసాయనాలకు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి. 

కెమికల్ వెపన్స్ కన్వెన్షన్‌పై సంతకాలు చేసిన దేశాల్లో రసాయనిక ఆయుధాలు పూర్తిగా తొలగించిన చివరి దేశంగా ప్రస్తుతం అమెరికా నిలిచింది. అయితే, కొన్ని దేశాలు తమ వద్ద గోప్యంగా ఈ ఆయుధాలు నిల్వ చేసుకున్నట్టు సమాచారం. 

ఈ ఆయుధాల వినియోగంతో కలిగే దారుణాలు ఎలా ఉంటాయో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచానికి తెలిసి వచ్చింది. అనంతరం, అనేక దేశాలు తమ వద్ద ఉన్న కెమికల్ వెపన్స్ పూర్తిగా తొలగించేందుకు ఓ ఒడంబడిక కుదుర్చుకున్నాయి. కానీ, కొన్ని దేశాలు వీటి అభివృద్ధి కోసం పరిశోధనలు చేయడం, మరిన్ని ఆయుధాలను పోగేసుకోవడం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి.


More Telugu News