బర్గర్లలో టమాటాల్లేవ్.., మెక్‌డొనాల్డ్స్ కూడా టమాటాను కొనుగోలు చేయలేకపోతోంది!

  • మెక్‌డొనాల్డ్స్‌పై టమాటా పెరుగుదల ప్రభావం
  • ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు నోటీసు
  • ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆదిత్య షా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. సెంచరీ దాటిన టమాటా ధర కొన్నిచోట్ల రూ.200 పైకి చేరుకుంది. టమాటాలు పండే ప్రాంతాల్లో భారీ వర్షాలు, జూన్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంట ఉత్పత్తి  తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా జూన్, జులై నెలల్లో టమాటాల వ్యవహారం ఖరీదుగా మారుతుంది. కానీ ఈ ఏడాది అది మరింత పెరిగింది. ఈ టమాటాల ధర పెరుగుదల ప్రభావం ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డొనాల్డ్స్ పైనా పడింది. దాంతో బర్గర్లలో టమాటాను దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్ లో అనేక ప్రాంతాలలో సరఫరా కొరత, నాణ్యత లేమి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్ తమ రెస్టారెంట్‌లలోని ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు  రెస్టారెంట్ వెలుపల అతికించిన నోటీసులో పేర్కొంది. మార్కెట్లో నాణ్యమైన టమాటాలు అందుబాటులో లేని కారణంగా బర్గర్లను టమాటా లేకుండా అందివ్వనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 

మెక్‌డొనాల్డ్స్ ప్రకటనను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఆదిత్య షా ట్విట్టర్ లో తొలుత షేర్ చేశారు. మెక్ డొనాల్డ్ ఢిల్లీ విభాగం ఈ నోటీసును ఉంచిందని, చివరకు మెక్ డొనాల్డ్స్ కూడా టమాటాలను కొనుగోలు చేయలేకపోతోందని ఆదిత్యషా సరదాగా కామెంట్ చేశారు.

అత్యుత్తమ పదార్థాలతో ఉత్తమమైన ఆహారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ తాము కట్టుబడి ఉన్నామని, తాము ప్రయత్నించినప్పటికీ, మంచి టమాటాలను తగిన పరిమాణంలో పొందలేకపోతున్నామని మెక్‌డొనాల్డ్స్ నోటీసులో పేర్కొంది. 


More Telugu News