ఆగంతుకుడి లేఖకు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి సంబంధం లేదు: రైల్వే సీపీఆర్ఓ

  • యాదాద్రి జిల్లాలో మంటల్లో చిక్కుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్
  • ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం
  • పలు బోగీలు పూర్తిగా దగ్ధం
  • ఆగంతుకుడి లేఖపై విచారణ జరుగుతోందన్న సీపీఆర్ఓ
హౌరా-సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం యాదాద్రి జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పలు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

కాగా, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో, రైల్వే శాఖకు ఓ అగంతుకుడు బెదిరింపు లేఖ రాసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే సీపీఆర్ఓ రాకేష్ స్పందించారు. ఆగంతుకుడి బెదిరింపు లేఖకు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆగంతుకుడి లేఖపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనలో 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

అటు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు. మంటలు అంటుకున్నాక వేగంగా వ్యాపించాయని తెలిపారు. మంటల ఉద్ధృతి చూసి వణికిపోయామని, చనిపోతామేమోనన్న భయం వేసిందని వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉంటే నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని ప్రయాణికులు స్పష్టం చేశారు.


More Telugu News