పుష్ప శ్రీవాణి ఫ్లెక్సీలకు పేడ రాసి నిరసన తెలిపిన గిరిజనులు

  • చింతలపాడు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
  • మా సమస్యల్ని ఏనాడైనా పట్టించుకున్నారా? అని నిలదీత
  • నిరసనకారులను అక్కడి నుండి పంపించివేసిన పోలీసులు
గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి చేదు అనుభవం ఎదురైంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడులో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గిరిజనులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీకి గిరిజనులు పేడ రాశారు. ఆ ఫ్లెక్సీలో పుష్పశ్రీవాణితో పాటు ఆమె భర్త, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షత్ రాజు కూడా ఉన్నారు. ఇద్దరి ముఖాలకు గిరిజనులు పేడ రాశారు. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తమ సమస్యలను ఏ రోజూ పట్టించుకోలేదని వారు మండిపడ్డారు.

సొంత గల్లా నింపుకోవడానికి వారికి పదవి ఉపయోగపడిందని విమర్శించారు. ఎమ్మెల్యే కాన్వాయ్ కి అడ్డు తగిలిన గిరిజనులు... బోయ, వాల్మీకులను ఎస్టీలలో చేర్చే తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తొమ్మిదేళ్లలో ఏం చేశారు? అని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, గిరిజన సంఘం నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్నవారిని అక్కడి నుండి పంపించారు.


More Telugu News