నారా లోకేశ్ ఆరోపణల నేపథ్యంలో దేవుడి ఎదుట ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణం
- అనిల్ కుమార్ భూదందాలపై తీవ్ర ఆరోపణలు చేసిన నారా లోకేశ్
- శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనిల్
- తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవంటూ దేవుడి ఎదుట ప్రమాణం
- లోకేశ్ కూడా ప్రమాణం చేయగలరా అని ప్రశ్న
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవినీతి కార్యకలాపాలు, భూ దందాలు అన్నీ ఇన్నీ కావంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేవుడిపై ప్రమాణం చేద్దామంటూ లోకేశ్‌కు అనిల్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అనిల్‌కుమార్ పూజలు నిర్వహించారు.
తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్ ప్రమాణం చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని చెప్పారు. లోకేశ్ కూడా ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు.
‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేశ్ కూడా దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేశ్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి ప్రమాణం చేస్తారా?” అని అనిల్ ప్రశ్నించారు.తాను ఎదుటి వారికి సాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదని చెప్పారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుందని ఎదురు ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడని అన్నారు.