ఛత్తీస్ గఢ్ లో మళ్లీ కాంగ్రెస్ దే అధికారం: పీపుల్స్ పల్స్ సర్వే
- ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 90
- కాంగ్రెస్ కు 53 నుంచి 60 స్థానాలు వస్తాయని సర్వేలో వెల్లడి
- బీజేపీ 20 నుంచి 27 స్థానాలకే పరిమితమవుతుందన్న సర్వే
డిసెంబర్ లో జరగనున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. వరుసగా రెండో సారి హస్తం పార్టీ అధికారాన్ని చేపడుతుందని తేలింది. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని చేపట్టాలంటే 46 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 53 నుంచి 60 స్థానాలు వస్తాయి. బీజేపీ 20 నుంచి 27 స్థానాలకే పరిమితం కానుంది. బీఎస్పీ, ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ లకు ఒక్కో స్థానం వచ్చే అవకాశం ఉంది.
గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం కూడా పెరగనున్నట్టు సర్వేలో తేలింది. 2018లో కాంగ్రెస్ కు 43.03 శాతం ఓట్లు రాగా... వచ్చే ఎన్నికల్లో 46 శాతం ఓట్లు రానున్నాయని వెల్లడయింది. ఇదే సమయంలో బీజేపీకి కూడా ఓట్ల శాతం 33 నుంచి 38 శాతానికి పెరగనుంది.