తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న డీఐజీ
- సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న విజయకుమార్
- కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా పని చేస్తున్న విజయకుమార్
- షాక్ కు గురయ్యానన్న సీఎం స్టాలిన్
డీఐజీ ర్యాంకు పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. కోయంబత్తూరు రేంజి డీఐజీ సి.విజయకుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని రెడ్ ఫీల్డ్స్ లో ఉన్న తన నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. విజయకుమార్ 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ జనవరిలో ఆయన డీఐజీగా బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు చెన్నైలోని అన్నానగర్ డీసీపీగా ఆయన పని చేశారు. దీనికి ముందు కాంచీపురం, కడలూర్, నాగపట్నం, తిరువారూర్ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలను నిర్వహించారు. డీఐజీ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
మరోవైపు విజయకుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయకుమార్ ఆత్మహత్య వార్త విని షాక్ కు గురయ్యానని ఆయన చెప్పారు. తమిళనాడు పోలీసు శాఖకు విజయకుమార్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతి రాష్ట్ర పోలీసు శాఖకు తీరని లోటు అని చెప్పారు. విజయకుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.