అమెరికాలో ఎన్నారైని తుపాకీతో కాల్చి చంపిన టీనేజర్లు

  • జార్జియాలోని అగస్టా నగరంలో వెలుగు చూసిన ఘోరం
  • స్థానిక షాపులో చోరీ చేసేందుకు వచ్చిన టీనేజర్లు
  • అక్కడే క్లర్క్‌గా చేస్తున్న మన్‌దీప్‌ సింగ్‌పై కాల్పులు, బాధితుడి దుర్మరణం
  • మన్‌దీప్ కుటుంబానికి అతడొక్కడే ఆధారం కావడంతో వారిని చుట్టుముట్టిన ఆర్థికకష్టాలు
  • అతడి కుటుంబానికి విరాళాల కోసం గోఫండ్‌మీ పేజ్ ప్రారంభం
అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో భారతీయుడు బలయ్యాడు. ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చోరీ కోసం వచ్చిన ఇద్దరు టీనేజర్లు అక్కడే క్లర్క్‌గా పనిచేస్తున్న మన్‌దీప్‌ సింగ్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు. అగస్టా నగరంలో జూన్ 28న ఈ ఘటన జరిగింది. నిందితులు ఇద్దరూ 15 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. ఆ షాపులో మన్‌దీప్ ఉద్యోగంలో చేరి నెలరోజులు కూడా కాలేదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు టీనేజర్లు తొలుత షాపులో దొంగతనానికి వచ్చారు. ఈ క్రమంలోనే మన్‌దీప్‌పై కాల్పులు జరిపారు. ఘటన జరిగిన సమయంలో వారు ముసుగు ధరించకపోవడంతో వారెవరో సులువుగా గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. 

మన్‌దీప్ తన కుటుంబంతో కలిసి అగస్టా నగరంలోనే నివసిస్తుంటాడు. అతడి మరణంతో ఆ కుటుంబం తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. కుటుంబానికి మన్‌దీప్ ఒక్కడే ఆధారం కావడంతో వారిని ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఈ విషమ పరిస్థితుల్లో వారి కోసం నిధుల సమీకరణకు స్థానికులు గోఫండ్‌మీ వెబ్‌సైట్‌‌తో విరాళాల సేకరణ ప్రారంభించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం, జార్జియాలో 2019లో సుమారు 1700 మంది తుపాకీ సంస్కృతికి బలయ్యారు. రోజుకు సగటున నలుగురు తుపాకీ గుళ్లకు బలవుతున్నట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.


More Telugu News