భారతీయ కాన్సులేట్‌పై దాడిని ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు

  • శాన్‌ఫ్రాన్‌సిస్కోలో భారతీయ కాన్సులేట్‌పై జులై 2న ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
  • కార్యాలయానికి నిప్పుపెట్టిన వైనం, వెంటనే మంటలను ఆర్పేసిన సిబ్బంది
  • దాడిని ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు
  • నిందితులపై చర్యలకు డిమాండ్
శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి తెగబడటాన్ని అమెరికా చట్టసభల సభ్యులు, ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్లు ఖండించారు. ఈ నేరపూరిత చర్యకు తెగబడ్డ నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, అమెరికాలో భారతీయ రాయబారి తరణ‌జీత్ సంధూపై ఖలిస్థానీ వాదులు నోరుపారేసుకుంటున్న తీరును కూడా వారు తప్పుబట్టారు. వాక్‌స్వాతంత్ర్యం అంటే హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని హితవు పలికారు. 

ఈ నెల 2న కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హింసను ప్రోత్సహిస్తే హింసే ఎదురవుతుందంటూ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వార్తలు కూడా జత చేశారు. దీంతో, ఈ ఘటన పెను దుమారానికి దారి తీసింది.


More Telugu News