వందేభారత్ ఆహార నాణ్యత ఒక్కమాటలో చెప్పాలంటే 'దారుణం'!

  • మడ్గాన్ జంక్షన్ - ముంబై వందేభారత్ రైలులో ఆహార నాణ్యతపై ట్వీట్
  • తాను రోజూ వందేభారత్ లో ప్రయాణిస్తానని వెల్లడి
  • వందేభారత్ ప్రారంభమైన రోజు, ప్రస్తుత ఫుడ్‌కు తేడా అంటూ ఫోటో షేర్
  • స్పందించిన ఐఆర్‌సీటీసీ
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించినప్పటి నుండి రాళ్లదాడి సంఘటనలు మొదలు అధిక టిక్కెట్ ఛార్జీలు, ఆహారం నాణ్యత వరకు వివిధ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వందే భారత్ రైలులో ఫుడ్ బాగాలేదంటూ ఓ ట్విట్టరిటీ ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. వందే భారత్ రైలు ప్రారంభమైన రోజున... ప్రస్తుత ఆహారానికి ఉన్న తేడాను పోల్చుతూ ఫోటో పెట్టాడు.

సదరు ట్విట్టరిటీ పేరు హిమాన్శు ముఖర్జీ. అతను మడ్గాన్ జంక్షన్ - ముంబై 22230 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించాడు. ఇందులో ఆహార నాణ్యత దారుణంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తాను రోజూ వందే భారత్ లో ప్రయాణిస్తానని వెల్లడించాడు.

వరుస ట్వీట్లలో... వందేభారత్ ప్రారంభోత్సవం సందర్భంగా అహుజా క్యాటరర్స్ నుండి రుచికరమైన ఆహారాన్ని ఉచితంగా అందించారని, కానీ ఇప్పుడు ఆహారం దారుణంగా ఉంటోందని ఓ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో.. ఈరోజు వందేభారత్ లోని ఆహార నాణ్యత గురించి ఒక్కమాటలో చెప్పాలంటే దారుణమని, పంటికి గట్టిగా తగిలేలా పన్నీరు, చల్లబడిన ఆహారం, ఉప్పగా ఉన్న దాల్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

అతని ట్వీట్ పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, దయచేసి మీరు మీ పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ ను ఇవ్వగలరని సూచించింది. ఆయన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కూడా స్పందించారు. తమకూ ఇలాంటి అనుభవం ఎదురైందని తెలిపారు.


More Telugu News