గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష... కోర్టు విచారణ అంశాన్ని ప్రస్తావించిన అధికారులు

  • గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం
  • ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించాలన్న సీఎం జగన్
  • సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎంకు వివరాలు తెలిపిన అధికారులు
  • పేదలకు ఇళ్లు రానివ్వకుండా నిరంతరం అడ్డుపడుతున్నారని సీఎం అసంతృప్తి 
ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూములు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాల పనులపై అధికారులు సీఎంకు వివరించారు. రూఫ్ లెవల్, ఆపై స్థాయిలో 5.68,517 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వారు నివేదించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని ధీమాగా చెప్పారు. 

సీఆర్డీఏలో ఇళ్ల నిర్మాణంపై కోర్టు విచారణ అంశాన్ని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డుపడుతున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలని ఆదేశించారు. డిసెంబరు లోగా విశాఖలో ఇళ్ల నిర్మాణం పూర్తికి కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. 

అటు, టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. తొలి దశలో 15 టిడ్కో కాలనీల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. టిడ్కో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం కార్యాచరణ కొనసాగించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు.


More Telugu News