సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలపై శివసేన స్పందన

  • అధికార కూటమిలో ఎన్సీపీ చేరడంపై పార్టీలో గందరగోళం లేదన్న శివసేన
  • ఏక్ నాథ్ షిండే రాజీనామా చేస్తారనే వార్తలను కొట్టిపారేసిన ఉదయ్ సావంత్
  • షిండేకు ఎమ్మెల్యేలు అందరూ మద్దతు పలికారన్న శివసేన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేసే ఆలోచన చేయడం లేదని, తమ కూటమిలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చేరడంతో తమ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని శివసేన తెలిపింది. షిండే రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలను శివసేన నేత ఉదయ్ సావంత్ కొట్టిపారేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునేవాళ్లమన్నారు. ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షిండే ప్రతి ఒక్కర్ని కలుపుకొని వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమన్నారు.

బుధవారం ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకొని, ఎమ్మెల్యేలు, ఎంపీలతో తన నివాసంలో భేటీ అయ్యారు. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అధికార కూటమిలో చేరడం శివసేనకు నచ్చలేదనీ, అందుకే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ప్రచారం సాగింది. దీనిపై చర్చించేందుకే నిన్న సమావేశమైనట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయ్ సావంత్ అలాంటిదేమీ లేదన్నారు.

నిన్న ఎమ్మెల్యేలు అందరూ ఏక్ నాథ్ షిండేకు మద్దతు పలికారని, రాజీనామా అనే ప్రచారం షిండే ప్రతిష్ఠను మసకబార్చేందుకే అన్నారు. ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ లేదన్నారు. ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. ఇప్పుడు అజిత్ పవార్ తమతో కలవడం అంటే శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు.


More Telugu News