ధరణి రిజిస్ట్రేషన్లు రాత్రిపూట జరుగుతున్నాయి: రేవంత్ రెడ్డి

  • ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి
  • ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టిస్తున్నారని ఆరోపణ
  • ప్రొహిబిటెడ్ భూములకు కూడా లే అవుట్లు వేస్తున్నారని వెల్లడి
ధరణి పోర్టల్ అక్రమాలకు నెలవుగా మారిందంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ధరణి అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ధరణి రిజిస్ట్రేషన్లు రాత్రి పూట జరుగుతున్నాయని ఆరోపించారు. శంకర్ హిల్స్ ప్రాంతంలో ప్రొహిబిటెడ్ భూముల విషయంలో అర్థరాత్రి వేళ తాళం తీసి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, మళ్లీ తాళం వేసి వాటిని ప్రొహిబిటెడ్ లిస్టు భూములు అంటున్నారని, ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించి తమ పేరు మీదకు మార్చుకుంటున్నారని వివరించారు. 

శ్రీధర్ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చు, ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద మార్చేయొచ్చు అని వివరించారు. ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లే అవుట్లు వేసి అమ్ముకోవడం... ఈ తతంగం ఇలా నడుస్తోందని రేవంత్ వెల్లడించారు. ధరణి పోర్టల్ సాయంతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు. 

ధరణి పోర్టల్ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్ లార్డో మనకు తెలియదు అని వ్యాఖ్యానించారు. 

"దీనికి సంబంధించిన ఏ వివరాలు మనకు ఇవ్వరు, ఆ దేశం నుంచి పెట్టుబడులకు పన్నులు ఉండవు... అలాంటి వ్యక్తుల చేతుల్లోకి ధరణి పోర్టల్ వెళ్లిపోయింది. ప్రభుత్వ భూములు, మన భూములు, మన బ్యాంకు ఖాతాలు, మన ఆధార్ వివరాలు, మన్ పాన్ కార్డుల వివరాలు విదేశీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఇంతటి అత్యంత తీవ్ర నేరానికి ప్రభుత్వం పాల్పడుతోంది. 

దీనికంతటికీ కారకుడు శ్రీధర్ గాదె అలియాస్ గాదె శ్రీధర్ రాజు. హైటెక్ సిటీ ప్రాంతంలో క్వాంటెల్లా అనే సంస్థ పేరిట హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనేక భూ అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమిక వివరాలు రాబట్టింది" అని రేవంత్ రెడ్డి వివరించారు.


More Telugu News