ఇక్కడికి ఎందుకొచ్చానో.. హాలీవుడ్‌లోనే ఉండుంటే పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని: మంచు లక్ష్మి
- ఇక్కడికి రాకముందు హాలీవుడ్ సినిమాలకు పని చేశానన్న మంచు లక్ష్మి
- తెలుగు ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల హీరోయిన్లనే ఇష్టపడతారని వ్యాఖ్య
- సొంత రాష్ట్రానికి చెందిన వారిని మాత్రం ఆదరించరని విమర్శ
- నిహారిక, బిందు మాధవి, శివాత్మిక, శివాని సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్న
మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తన సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను అందుకుంది మంచులక్ష్మి. నటిగా, హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తను మాట్లాడే విధానంపై సెటైర్లు వేసినా.. స్పోర్టివ్‌గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేశానని మంచులక్ష్మి వెల్లడించింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్నని, ఇక్కడికి ఎందుకొచ్చానో అని అనిపిస్తుందని చెప్పింది. ఆ దేవుడు దయ తలిస్తే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది.
‘‘తెలుగు ప్రేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వారి సొంత రాష్ట్రానికి చెందిన వారిని మాత్రం ఆదరించరు. ఇక్కడి హీరోయిన్లని ఒక్క శాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారు” అని చెప్పింది.
‘‘ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు? బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని ఎందుకు చేయడం లేదు? వీళ్లు ఎందులో తక్కువ? అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా?’’ అని మంచు లక్ష్మి ప్రశ్నించింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా ముంబయి, పంజాబ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక హీరోయిన్లే కావాలని, కానీ తెలుగు వారిని మాత్రం వద్దంటారని విమర్శలు చేసింది.