రాత్రి భోజనం తర్వాత నడకకు ఉత్తమమైన సమయం ఇదే..!

  • సాధారణంగా నడిచే అలవాటు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే చేయొచ్చు
  • బ్రిస్క్ వాక్ కు పావుగంట తర్వాత చేయడం మేలంటున్న నిపుణులు
  • అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని సూచన
భోజనం పూర్తయ్యాక కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, భోజనం చేశాక నడక ఎప్పుడు మొదలు పెట్టాలనేది మాత్రం వ్యక్తులను బట్టి మారుతుందట. కొంతమంది తిన్న వెంటనే నడక మొదలు పెడితే మరికొందరు మాత్రం కాసేపు విశ్రాంతి తీసుకున్నాక నడవడం మేలని చెబుతున్నారు. ఇక సాధారణంగా నడిచే వారు తిన్న వెంటనే వాకింగ్ కు వెళ్లొచ్చని, బ్రిస్క్ వాక్ చేసే అలవాటు ఉన్నవారు మాత్రం ఓ పావుగంట పాటు ఆగి, ఆ తర్వాతే వాకింగ్ కి వెళ్లాలని సూచిస్తున్నారు.

రాత్రిపూట భోజనం చేశాక అసౌకర్యంగా లేదా ఉబ్బరంగా అనిపిస్తే వాకింగ్ కి వెళ్లడానికి అరగంట పాటు వెయిట్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసౌకర్యం ఏమీ లేనట్లయితే డిన్నర్ పూర్తయిన వెంటనే వాకింగ్ కి వెళ్లవచ్చని సూచిస్తున్నారు. అయితే, భోజనం చేశాక సాధారణ నడకే మంచిదని, బ్రిస్క్ వాక్ చేసేటట్లయితే కాసేపు ఆగిన తర్వాతే వాకింగ్ కి వెళ్లాలని అంటున్నారు.

ఎప్పుడు నడవాలనే ప్రశ్నకు నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదని, మీ వ్యక్తిగత ప్రాధాన్యత, శరీర సౌకర్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. భోజనం తర్వాత నడవడం శారీరక ఉత్తేజానికి, జీర్ణక్రియకు సాయపడేందుకు ఉపయోగకరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహాతో వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.


More Telugu News