అన్ని దరిద్రాలకు కేంద్రమే కారణం.. పవన్ వారాహి యాత్ర సక్సెస్: ఉండవల్లి

  • ఉమ్మడి పౌరస్మృతిపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలన్న ఉండవల్లి
  • ఏపీలో మోదీని వ్యతిరేకించే పార్టీలే లేవని విమర్శ
  • పోలవరం డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిందని ప్రశ్న
దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని లా కమిషన్ తిరస్కరించిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించడం సరికాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటోందని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ బీజేపీ అజెండాలోనిదేనని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. 

ఏపీలో ప్రధాని మోదీని వ్యతిరేకించే పార్టీలే లేవని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలందరూ బీజేపీకి దాసోహమయ్యారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిందని ఆయన ప్రశ్నించారు. దీనికి బాధ్యులను గుర్తించి శిక్షించాలని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. పూర్తి స్థాయిలో డయాఫ్రం వాల్ ను నిర్మిస్తారా? లేక దెబ్బతిన్నంత వరకే కడతారా? అని అడిగారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విజయవంతమయిందని ఉండవల్లి చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కు పట్టు ఉందని అన్నారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ప్రయోజనం ఉంటుందని అన్నారు.


More Telugu News