బండి సంజయ్‌తో గ్యాప్ లేదు.. కిషన్ రెడ్డితో సత్సంబంధాలున్నాయి: ఈటల

  • పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్న రాజేందర్
  • బీజేపీ నుండి ఎవరూ వెళ్లిపోవడం లేదని వెల్లడి
  • వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని మోదీ సందేశమిస్తారన్న ఈటల
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఈటీవీ ముఖాముఖిలో మాట్లాడుతూ.. పార్టీ పదవి అనేది బాధ్యతతో కూడుకున్నదని, ప్రస్తుత రాజకీయాల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ తన శక్తిమేరకు పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తానన్నారు. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులపై స్పందిస్తూ... రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమేనని, కానీ కేసీఆర్ ను ఓడించే పార్టీ ఏదనే విషయమై ఇప్పటికే ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ను కట్టడి చేయగలుగుతుంది, ఓడిస్తుందని ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ ఆరు నెలల కాలంలో పార్టీ నాయకులమంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.

తాను పరిణతి కలిగిన రాజకీయ నాయకుడినని, తనకు బండి సంజయ్ సహా ఎవరితోను గ్యాప్ లేదన్నారు. కిషన్ రెడ్డితో తనకు ఇరవయ్యేళ్ల స్నేహం ఉందని, శాసనసభా పక్ష నేతగా తమతో కలిసి పని చేశారని గుర్తు చేశారు. బీజేపీ నుండి ఎవరూ వెళ్లిపోవడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాలు గెలిచిందని, ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు. మునుగోడులో తాము రెండో స్థానంలో నిలిచామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను తామే గెలిచామన్నారు. తెలంగాణ ప్రజలారా.. మీకు అండగా నేనున్నా.. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని వరంగల్ సభలో ప్రధాని మోదీ సందేశమస్తారన్నారు.


More Telugu News