అమితాబ్ బచ్చన్‌కు 82 ఏళ్లు.. ఇప్పటికీ నటిస్తున్నారుగా!: అజిత్‌కు సుప్రియా సూలే కౌంటర్

  • ఎన్సీపీని అవినీతి పార్టీ అన్న బీజేపీతో ఎలా జతకట్టారు? అని సుప్రియ ప్రశ్న
  • సైరస్ పూనావాలా 84 ఏళ్ల వయస్సులోను పని చేస్తున్నారని వెల్లడి
  • పార్టీ గుర్తును ఎవరూ ఎత్తుకెళ్లలేరన్న శరద్ పవార్
బీజేపీలో నేతలు 75 ఏళ్లకే పదవీ విరమణ తీసుకుంటారని, మీకు 83 ఏళ్లున్నాయి.. మీరు రిటైర్ అవుతున్నారా? లేదా? చెప్పాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను అజిత్ పవార్ ప్రశ్నించారు. అజిత్ వ్యాఖ్యలపై ఎంపీ సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు. సైరస్ పూనావాలా వయస్సు 84 అని, ఇప్పటికీ ఆయన పని చేస్తున్నారని, అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయస్సులోను నటిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. 

ఇక శరద్ పవార్ తనకు మాత్రమే తండ్రి కాదని, ఎన్సీపీ కార్యకర్తలందరికీ తండ్రిలాంటివాడు అనీ అన్నారు. నీకు కావాల్సిన వారి మీద మాటల దాడి చేసుకో.. కానీ నా తండ్రిపై కాదని మండిపడ్డారు. ఎన్సీపీని అవినీతి పార్టీ అంటూ బీజేపీ విమర్శలు చేసిందని, ఇప్పుడు తమ పార్టీలోని ఓ వర్గంతో ఎలా జత కట్టిందని ప్రశ్నించారు.

తన మద్దతుదారులతో భేటీ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఓపెన్ కమ్యూనికేషన్ లేదని, సామాన్యుడి మనోభావాలను అర్థం చేసుకోవాలంటే మైదానంలోకి వెళ్లాలని మండిపడ్డారు. ప్రధాని అంటే దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కానీ, ఒక పార్టీకి కాదని విమర్శించారు. ఎన్సీపీ నేతలపై కేసులు ఉంటే ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

పీవీ నర్సింహారావు, మన్మోహన్ హయాంలో ఎంపీలు తమ నియోజకవర్గ సమస్యలపై సమావేశాల్లో మాట్లాడేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు. సంప్రదింపులు లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని, ఇది అప్రజాస్వామికమన్నారు. పార్టీ గుర్తును ఎవరూ లాక్కోలేరని, నాయకులు, కార్యకర్తలు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీరు నన్ను గురువు అంటున్నారు, నేనే మీకు స్పూర్తి అంటున్నారు.. అలాంటప్పుడు తనను ఎలా నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.


More Telugu News