బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  • మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • తెలంగాణలో 6 జిల్లాలకు భారీ వర్ష సూచన
  • మరో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన తర్వాత నెమ్మదించిన నైరుతి రుతుపవనాలకు బూస్టప్ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలోని ఆరు జిల్లాలకు భారీ వర్షసూచన చేయడంతో పాటు 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు, ఈ ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని హెచ్చరించారు.


More Telugu News