మహారాష్ట్రలో మరో కీలక పరిణామం.. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గం పోటాపోటీ సమావేశాలు

  • 11 గంటలకు అజిత్ వర్గం, ఒంటి గంటకు శరద్ పవార్ వర్గం సమావేశం
  • సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇరు వర్గాలు ఆదేశాలు
  • అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ వర్గం
మహారాష్ట్రలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోపాటు బీజేపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడి కుమారుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం నేడు పోటాపోటీగా వేర్వేరుగా సమావేశం అవుతున్నాయి. శరద్ పవర్ వర్గం దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అవుతుండగా అజిత్ వర్గం బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. 

సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లు హాజరు కావాలంటూ శరద్ పవర్ ఎన్సీపీ చీఫ్ విప్ జితేంద్ర అవహద్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అజిత్ వర్గం చీఫ్ విప్ అనిల్ పాటిల్ కూడా తమ వర్గం ఎమ్మెల్యేలకు అలాంటి ఆదేశాలే ఇచ్చారు. 

శరద్ పవార్‌కు చేయిచ్చి ఇటీవల శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ పార్టీలోని 53 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గవర్నర్‌కు తెలిపారు. అయితే, ఆయన వెనక ఉన్నది 13 మంది మాత్రమేనని శరద్ పవార్ వర్గం వాదిస్తోంది. మరోవైపు, అజిత్ పవార్, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసింది.


More Telugu News