బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు.. అధికారంలోకి వస్తాం: ధర్మపురి అర్వింద్

  • తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారని బండిపై ప్రశంసలు
  • ఎంతో అగ్రెసివ్‌గా వెళ్లి తన టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేశారన్న ధర్మపురి
  • కిషన్ రెడ్డి నాయకత్వంలో సునాయాసంగా బీజేపీ గెలుస్తుందని ధీమా
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డిది లక్కీ హ్యాండ్ అని, 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కిషన్ రెడ్డి పరిపక్వత కలిగిన నాయకుడన్నారు. అలాంటి వారిని అధ్యక్షుడిగా నియమించినందుకు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అలాగే, ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈటల తెలంగాణవ్యాప్తంగా అగ్రెసివ్ గా వెళ్తారని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బండి సంజయ్ ఎంతో అగ్రెసివ్ గా తన టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి, నిజమైన కార్యకర్తగా రుజువు చేసుకున్నారన్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తామంతా కలిసి పని చేసి, పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. 2024లో కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ ఎలా ఉంది.. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక ఏం చేశాడో అందరికీ తెలుసునని ధర్మపురి అర్వింద్ అన్నారు. ఒక నియోజకవర్గంలో గెలవని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ కాంగ్రెస్ పార్టీని పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ప్రణబ్, గులాం నబీ ఆజాద్ లకు కానిది ఓ వర్గం మీడియాకు అవుతుందా? అని ఎద్దేవా చేశారు. మీడియా ప్రయత్నాలు చేస్తే రాహుల్ లీడర్ కాలేడన్నారు.

ప్రధాని మోదీ బీసీ అని, ఈటల రాజేందర్ బీసీ అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీకి కుల, మత వ్యత్యాసాలు లేవన్నారు. నిన్నటి వరకు బీసీ నేత బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడని గుర్తు చేశారు. బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై కొంతమంది బాధపడటం సహజమేనని, కానీ రాజకీయం తమ పార్టీ అధిష్ఠానానికి ఎక్కువగా తెలుసు అన్నారు. గుజరాత్, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేసి, బీజేపీ గెలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిచాక తమ శాసనసభా పక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందన్నారు.



More Telugu News