మహాత్మాగాంధీ, జిన్నా, మండేలా నిస్వార్థ సేవకులు: ఇమ్రాన్ ఖాన్

  • అరెస్ట్ చేసి జైల్లో వేసినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ఇమ్రాన్
  • తాను బయట ఉంటే పార్టీ బలపడుతుందని వారి భయమని వ్యాఖ్య
  • గాంధీ, జిన్నా, మండేలా తనకు స్ఫూర్తి అని చెప్పిన ఇమ్రాన్ 
తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా, అరెస్ట్ చేసి జైల్లో వేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది ఇండిపెండెంట్'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనను వాళ్లు మళ్లీ జైల్లో పెడతారని తెలుసునని, అందుకు సమయం ఏమీ పట్టదన్నారు. ఎందుకంటే తాను బయట ఉంటే తన పార్టీ ఎంతో బలపడుతుందని వారిలో భయం ఉందన్నారు. అందుకే జైల్లో పెట్టి, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటి వరకు వేలాదిమంది తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని, తమ పార్టీ అంటే భయంతోనే తనను జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తద్వారా తనపై అనర్హత వేటు వేయాలనేది వారి వ్యూహం అన్నారు. తాను మాత్రం ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని, ఎంతగా అణచివేసే ప్రయత్నాలు చేస్తే అంతగా తమ పార్టీకి మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవని తెలిపారు. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా వంటి నేతల అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు.

రాజకీయాలే కెరీర్ గా తాను రాలేదని, తన తనయులనూ రాజకీయాల్లోకి రావొద్దనే చెబుతానని తెలిపారు. ఎందుకంటే ఇదో వరస్ట్ కెరీర్... రాజకీయాలు అంటే ఓ లక్ష్యంతో కూడుకున్నవి అన్నారు. మహాత్మాగాంధీ, జిన్నా, మండేలా వంటి వారు స్వేచ్ఛ కోసం పోరాడారని, వారు నిస్వార్థ సేవకులుగా ఉన్నారన్నారు. వారే తనకు స్ఫూర్తి అన్నారు. వారు ఎప్పుడూ అధికారం కోసం ప్రయత్నం చేయలేదని, ఓ లక్ష్యం కోసం పోరాడినట్లు చెప్పారు. తానూ ఓ లక్ష్యంతో పని చేస్తున్నానని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీదే విజయం అన్నారు.


More Telugu News