హార్లే డేవిడ్సన్ అత్యంత చౌక బైక్ వచ్చేసింది!
- ‘ఎక్స్440’ పేరుతో కొత్త మోడల్‌ను లాంచ్ చేసిన హార్లే డేవిడ్సన్
- ప్రారంభ ధర రూ.2.29 లక్షలు మాత్రమే
- ఇండియన్ మార్కెట్ టార్గెట్‌గానే తీసుకొచ్చిన హార్లే
హార్లే డేవిడ్సన్.. యువతకు కలల బైకు. లుక్, ఫీచర్స్, స్టైల్ అన్నీ ఓ రేంజ్‌లో ఉంటాయి. హార్లే బైక్‌లను కొనడం సంగతి దేవుడెరుగు.. కనీసం జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకునే కుర్రాళ్లు ఎందరో. అలా ఉంటాయి హార్లే బైక్స్ ధరలు. మోడల్‌ని బట్టి ఒక్కొక్కటి కనీసం రూ.6.5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పైగా (ఎక్స్‌షోరూమ్ ధరలు) ఉంటాయి.
ధరలు ఈ రేంజ్‌లో ఉండటంతో భారతదేశంలో హార్లే డేవిడ్సన్ బైకులు పెద్దగా అమ్ముడుపోవడంలేదు. యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో మార్కెట్‌ను పెంచుకునేందుకు హార్లే చౌక్ బైక్‌లపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చరిత్రలోనే చీపెస్ట్ బండిని రెడీ చేసింది.
‘ఎక్స్440’ పేరుతో కొత్త మోడల్‌ను హార్లే డేవిడ్సన్ లాంచ్ చేసింది. డెనిమ్, వివిడ్, ఎస్ పేరుతో మూడు వేరియంట్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.2.29 లక్షలు, రూ.2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు).
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా ఉంది. ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. బ్రేకింగ్, సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయేలా ఉంటాయి.
హార్లే డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగానే ఈ బైక్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో రెట్రో లుక్ బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఎదురులేదు. హార్లే తీసుకొచ్చిన ఎక్స్440 ధర.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే రూ.35 వేలు తక్కువ కావడం గమనార్హం.