కేరళను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు... '2018' పునరావృతం అవుతుందా?

  • కేరళపై నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్
  • మరో 5 రోజుల పాటు వర్షసూచన చేసిన ఐఎండీ
  • రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్... మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం విజయన్
కేరళపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. కేరళ తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయన్న భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరికతో ఆందోళన నెలకొంది. 

ఇడుక్కి, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఎర్నాకుళం, అళప్పుజ విద్యాసంస్థల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. కాసర్ గోడ్ జిల్లాలో స్కూళ్లు మూసివేయనున్నారు. ఈ జిల్లాలో చెట్టు విరిగిపడడంతో ఓ బాలిక మృతి చెందింది. 

కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 

కేరళలో 2018, 2020లో భారీ వరదలు సంభవించడం తెలిసిందే. ముఖ్యంగా, 2018లో కేరళ వరదలకు 483 మంది మృత్యువాతపడ్డారు. ఈ వరదలపై '2018' పేరుతో ఇటీవల వచ్చిన సినిమా విజయవంతమైంది. 2020లోనూ కేరళను వరదలు ముంచెత్తగా, 104 మంది మరణించారు.


More Telugu News