కోపం వచ్చి బర్తరఫ్ చేశారు... ఆనాడు బాధనిపించింది: ఈటల
- ఏం తప్పు చేశానని బర్తరఫ్ చేశారని ప్రశ్నించిన ఈటల
- ధర్నాచౌక్ ఎత్తివేస్తే ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించానని వెల్లడి
- మున్సిపల్ ఉద్యోగులను తీసేస్తే... అది తప్పని చెప్పానని వివరణ
తనపై కోపం వచ్చి ఆ రోజు బర్తరఫ్ చేశారని, ఆ రోజు తాను బాధపడ్డానని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తాను ఏం తప్పు చేశానని బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. ధర్నా చౌక్ ఎత్తివేస్తే ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించానని, మున్సిపల్ కార్మికులను తీసేస్తే అది తప్పని చెప్పానని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు 39 మంది చనిపోయారని, వాళ్ల ఉసురు పోసుకున్నారని చెప్పినందుకు బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. కాగా, రెండేళ్ల క్రితం భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరమయ్యారు. తనను ఆ రోజు బర్తరఫ్ చేయడంపై తాను బాధపడినట్లు ఈటల పునరుద్ఘాటించారు.