శ్రీలంకలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరిన శ్రీలంక ప్రతినిధులు... సానుకూలంగా స్పందించిన సీఎం జగన్

  • తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన శ్రీలంక ప్రతినిధులు
  • ఏపీ అభివృద్ధి గురించి శ్రీవారి భక్తుల ద్వారా తెలిసిందని వెల్లడి
  • ఏపీతో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆసక్తి
  • తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం
శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డి.వెంకటేశ్వరన్, ఇతర శ్రీలంక అధికారుల బృందం నేడు ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లిలో కలిసింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. 

శ్రీలంక నుంచి భారత్ కు వచ్చే భక్తుల్లో 50 శాతం మంది తిరుమలను తప్పక సందర్శిస్తుంటారని, వారి ద్వారా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తాము విన్నామని శ్రీలంక ప్రతినిధులు తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం జగన్ ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇవాళ తాడేపల్లి వచ్చామని వారు వివరించారు.  

వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఆసక్తి వ్యక్తం చేశారు. ఆక్వా రంగ పురోభివృద్ధి, ఆక్వా రంగ ఎగుమతుల్లో ఏపీ పెంపుదల సాధించిన నేపథ్యంలో, శ్రీలంకలోనూ ఆక్వా రంగం అభివృద్ధికి సహకారం అందించాలని శ్రీలంక ప్రతినిధులు సీఎం జగన్ ను కోరారు. 

కరోనా సంక్షోభం అనంతరం శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోందని, ఖనిజ వనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని వారు తెలిపారు. 

కాగా,  శ్రీలంకలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు సీఎం జగన్ ను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.


More Telugu News