శరద్ పవార్ మా జాతీయ అధ్యక్షుడు అనే విషయం మరిచారా?: అజిత్ పవార్ ట్విస్ట్

  • మెజార్టీ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారన్న అజిత్
  • ఎన్సీపీ పేరు, గుర్తు తమకే చెందుతాయని వ్యాఖ్య
  • పవార్ కు చేతులు జోడించి వేడుకున్న ప్రఫుల్ పటేల్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తిరుగుబాటు నేత అజిత్ పవార్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ అని స్పష్టం చేశారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ తదితరులు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ టట్కారే, పార్టీ చీఫ్ విప్ గా అనిల్ బాయిదాస్ పటేల్‌లను నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు.

అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ... పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నట్లు చెప్పారు. తాము ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నట్లు చెప్పారు. ఎన్సీపీ పేరు, గుర్తు తమకే చెందుతాయన్నారు. పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదని, సాఫీగా ముందుకు సాగుతుందన్నారు. 
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అని మీడియా అడగగా.. శరద్ పవార్ మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అనే విషయం మరిచిపోయారా? అని సమాధానం ఇచ్చారు.

తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తానని అజిత్ పవార్ ఎన్సీపీ గ్రూప్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సునీల్ అన్నారు. మరో నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ... తమపై అనర్హత వేటు వేసే అధికారం ఎవరికీ లేదన్నారు. తాను శరద్ పవార్ కు చేతులు జోడించి అడుగుతున్నానని, మాకు మీ ఆశీస్సులు కావాలన్నారు. ఆయన మా గురువు అని వ్యాఖ్యానించారు.


More Telugu News