ధోనీని మొదటిసారి కలిసినప్పుడు ఏం మాట్లాడిందీ వెల్లడించిన టీమిండియా కొత్త బౌలర్

  • మరి కొన్నిరోజుల్లో వెస్టిండీస్ లో టీమిండియా టూర్
  • టెస్టు, వన్డే జట్లకు ఎంపికైన బెంగాల్ పేసర్ ముఖేశ్ కుమార్
  • ధోనీ సలహాలతో తన దృక్పథం మారిందని వెల్లడి
  • ధోనీ చెప్పిందే రైట్ అని వివరణ
వెస్టిండీస్ లో పర్యటించే భారత జట్టులో కొత్త పేసర్ ముఖేశ్ కుమార్ కు స్థానం లభించడం తెలిసిందే. రంజీల్లోనూ, ఐపీఎల్ లోనూ తన పేస్ బౌలింగ్ తో ఆకట్టుకున్న ఈ బెంగాల్ బౌలర్ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సెలెక్టర్లు అతడిని టెస్టు, వన్డే... రెండు జట్లకూ ఎంపిక చేశారు. 

ముఖేశ్ కుమార్ 2022-23 రంజీ సీజన్ లో 22 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 149 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ముఖేశ్ కుమార్ 10 మ్యాచ్ ల్లో 7 వికెట్లు తీశాడు. ఆ 7 వికెట్లలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ వికెట్లు కూడా ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ కుమార్ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. టీమిండియాకు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉందని తెలిపాడు. జాతీయ జట్టుకు పిలుపు వస్తుందని తాను ఊహించానని వెల్లడించాడు. 

కాగా, ఐపీఎల్ ఆడిన సమయంలో మొట్టమొదటిసారి ధోనీని కలిశానని ముఖేశ్ కుమార్ పేర్కొన్నాడు. యువ క్రికెటర్లకు అతడిచ్చే సలహాలు ఎంత అమూల్యమైనవో తెలిసిందేనని, తాను కూడా సలహాల కోసమే ధోనీని కలిశానని వివరణ ఇచ్చాడు. 

"మొదటిసారి ధోనీని కలిసినప్పుడు, ఓ కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా మీ బౌలర్లకు ఏం చెబుతారో వెల్లడించండి అని కోరాను. దాంతో ధోనీ నా భుజాల చుట్టూ చేయి వేసి... నువ్వు ఎప్పుడయితే ప్రయత్నించడం ఆపేస్తావో, అప్పుడే నేర్చుకోవడం ఆపేస్తావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో కచ్చితంగా అదే చేయి. అందుకు కూడా నువ్వు సిద్ధంగా లేకపోతే నీ ఎదుగుదల ఆగిపోయినట్టే. ఏం జరుగుతుందో అని పట్టించుకోవద్దు... ముందు నువ్వు ప్రయత్నించు అని ప్రతి బౌలర్ కు చెబుతాను అని ధోనీ వెల్లడించాడు. ఈ సంగతులను ధోనీ ఎంతో బాగా వివరించాడు. అప్పటి నుంచి ఆట పట్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది. ధోనీ చెప్పింది కచ్చితంగా సరైనదేనని అనిపించింది" అని ముఖేశ్ కుమార్ వివరించాడు.


More Telugu News