అమెరికాలో నాటా తెలుగు సభలనుద్దేశించి సీఎం జగన్ సందేశం

  • అమెరికాలోని డల్లాస్ లో నాటా కన్వెన్షన్-2023
  • ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ అంటూ సీఎం జగన్ సందేశం
  • నాలుగేళ్ల కిందట తాను డల్లాస్ వచ్చానని వెల్లడి
  • తెలుగువారు చూపిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనన్న సీఎం
అమెరికాలోని డల్లాస్ వేదికగా ఏర్పాటు చేసిన నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సీఎం జగన్ తన సందేశాన్ని అందించారు. నాటా కన్వెన్షన్-2023కి హాజరైన ప్రతి ఒక్కరికీ కూడా తన బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

"నాటా కార్యవర్గానికి, ముఖ్యంగా శ్రీధర్ కు, అనిల్ కు, ప్రేమ్ సాగర్ అన్నకు, అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నాలుగేళ్ల కిందట నేను డల్లాస్ కు వచ్చిన సందర్భంగా ఇంకా గుర్తుంది. ఆ సమయంలో మీరందరూ నాపై చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను. 

వేరే దేశంలో ఉన్నప్పటికీ ఇంతమంది తెలుగు వారు గొప్పవైన మన సంప్రదాయాలను, సంస్కృతులను కాపాడుకుంటూ, చక్కటి ఐకమత్యాన్ని చాటుకుంటుండడం సంతోషదాయకం. మీరందరూ అక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్థల్లో సైంటిస్టులుగా, వ్యాపారవేత్తలుగా, వైద్యులుగా, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కీలక పదవుల్లో రాణిస్తున్న వైనాన్ని చూసి ఇక్కడ మేం గర్వపడుతున్నాం. 

మీలో అనేకమంది మూలాలు ఇక్కడి గ్రామాల్లో, ఇక్కడి మట్టిలో ఉన్నాయి. మీలో అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినా, అమెరికా గడ్డపై నిలదొక్కుకునేందుకు ఎంతో కఠోరశ్రమ, అంకితభావం ప్రదర్శిస్తున్నారు. మిమ్మల్ని చూసి మేం స్ఫూర్తిపొందుతున్నాం" అంటూ నాటా సభ్యులను ఉద్దేశించి సీఎం జగన్ పేర్కొన్నారు.


More Telugu News