పెళ్లి కాని వాళ్లకు పెన్షన్.. ఎక్కడంటే?

  • హర్యానా ప్రభుత్వం వినూత్న నిర్ణయం
  • 45-60 ఏళ్ల వయసున్న పెళ్లి కాని వారికి పెన్షన్
  • నెల రోజుల్లోగా కొత్త పథకం తీసుకొస్తామన్న సీఎం ఖట్టర్
హర్యానా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. 45-60 ఏళ్ల వయసున్న, పెళ్లి కాని వారిని ఇందుకు అర్హులుగా గుర్తించనుంది. ఈ మేరకు కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్వయంగా వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నాల్‌లో జరిగిన జన్‌ సంవద్‌ కార్యక్రమంలో ఖట్టర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ 60 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తి మాట్లాడుతూ.. పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనికి సీఎం బదులిస్తూ.. ‘‘45 ఏళ్లు పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛను ఇచ్చేలా కొత్త పథకం తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టాం. నెలరోజుల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

వృద్ధాప్య పింఛనును కూడా వచ్చే ఆరు నెలల్లో రూ.3 వేలకు పెంచనున్నట్లు సీఎం తెలిపారు. 
పెళ్లి కాని వాళ్లకు పెన్షన్ పథకానికి అర్హత ఏంటి? ఎంతమందికి ఇస్తారు? వంటి ఇతర వివరాలను సీఎం వెల్లడించలేదు. ఎంత పింఛను ఇస్తారన్నది కూడా స్పష్టం చేయలేదు.


More Telugu News